ప్రతీ ముహూర్తానికి తారాబలం తర్వాత చూడవలసిన ముఖ్యమైన అంశము చంద్రబలం. వివాహాది శుభముహూర్తములు అన్నింటికీ తప్పని సరిగా చంద్రబలం కూడా ఉండి తీరాల్సిందే. చంద్రుడు మనః కారకుడు. అందువలన చేసే ప్రతీ పనిలోనూ శ్రద్ధ చూపి, ఆయా పనులయందు ఏర్పడే లోటు పాట్లను తెలుసుకోగలిగేందుకు లేదా వాటి యందు కలిగే వ్యతిరేఖ ఫలితాలను తట్టుకొని నిలబడగల సామర్ధ్యం తప్పనిసరిగా పొందాలంటే ఆయా జాతకులకి చంద్రబలం కూడా ఉండాల్సిందే. అందుకే తారాబలం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది చంద్రబలం అని చెప్పవచ్చును. మరి ఈ చంద్రబలాన్ని ఎలా లెఖగట్టాలో ఇప్పుడు చూద్దాం..
౧. ముదుగా జాతకుని "జన్మనక్షత్రం లేదా నామనక్షత్రం" ప్రకారంగా ఆ జాతకుని యొక్క "రాశి" ని పరిగణలోకి తీసుకోవాలి. ఇలా వచ్చే రాశి జాతకుని రాశి అవుతుంది.
౨. తదుపరి ఆ జాతకునికి నిర్ణయిద్దామనుకొన్న ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం ఏమయ్యిందో చూసి, ఆ నక్షత్రంలోనే, ముహూర్త సమయానికి ఏ పాదం ఉందో కూడా లెఖగట్టి తద్వారా వచ్చే "రాశి" ని పరిగణించాలి. ఇలా వచ్చే రాశి ముహూర్త రాశి అవుతుంది.
౩. ఇప్పుడు తారాబలం చూసినట్టుగానే ఇక్కడ కూడా జాతకుని రాశి నుండి ముహూర్త రాశి వరకూ లెఖ పెట్టుకొంటూ వెళ్ళగా ఎన్నో రాశి అయినదో చూసుకోవాలి.
౪. అలా లెఖపెట్టగా వచ్చిన అంకెనుబట్టి ఆ జాతకునికి చంద్రబలం ఉన్నదీ లేనిదీ చెబుతాము.
ఉదాః-
జాతకుని జన్మ నక్షత్రం మృగశిర ౩ వ పాదం ( అనగా మిధున రాశి).
ఈ జాతకునికి చూద్దామనుకున్న ముహూర్తానికి ఉన్న నక్షత్రం ఉత్తర. (పాదప్రమాణం కడితే ముహూర్త సమయానికి ఉత్తర ౪ వ పాదం ఉన్నదనుకుందాము. అప్పుడు ముహూర్త రాశి కన్యా రాశి అవుతుంది.)
ఇలా రెండు రాశులు వచ్చాక, ముందుగా జాతకుని రాశి నుండి ముహూర్త రాశికి లెఖించగా ౪ అని వస్తుంది. (అనగా మిధునం నుండి కన్యకి లెఖించగా ౪ వ రాశి అని వస్తుంది.)
ఇప్పుడు ఈ జాతకునికి చంద్రబలం ఉన్నదా లేదా అనేది చూద్దాము.
సూత్రం:-
" శుక్ల పక్షంలో ౪, ౮, ౧౨ (4, 8, 12) మరియు కృష్ణ పక్షంలో ౨, ౫, ౯ (2, 5, 9) వచ్చిన చంద్రబలము ఉండదు."
పై సూత్రం ప్రకారంగా ఇందాక మనకు వచ్చిన అంకె ౪, కావున ఈ జాతకునికి చూద్దామనుకున్న ముహూర్తం శుక్ల పక్షంలో గనుక ఉంటే ఆ ముహూర్తం పెట్టరాదు. ఒకవేళ కృష్ణ పక్షంలో ఉన్నట్లయితే ఆ ముహూర్తం పెట్టవచ్చును.
గమనికః-
శుక్ల పక్షంలో చంద్రుడు జాతకుని రాశినుండి 2-5-9 స్థానాలలోనూ, కృష్ణ పక్షంలో 4-8-12 స్థానాలలోనూ, ఉభయ పక్షములలో 1-3-6-7-10-11 స్థానాలలోనూ చంద్రుడు ఉన్న ముహూర్తం చంద్రబలానికి మంచిది.